బెజవాడ (Bezawada)లో జరుగుతున్న వరుస సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం భవానీపురం (Bhavanipuram)లో యువతి (Young Woman)పై కత్తితో దాడి ఘటన మరువక ముందే.. విజయవాడ (Vijayawada) పంజాసెంటర్ (Panja Center) వద్ద జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ నగరంలో అర్ధరాత్రి జరిగిన ఘోర సంఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడ పంజాసెంటర్ వద్ద మతిస్థిమితం లేని మహిళపై అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో బయటపడింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 21వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని చంటి (40)గా పోలీసులు గుర్తించారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాధితురాలిని చిట్టినగర్ సొరంగం వద్ద పడేసి పరారయ్యాడు.
ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు, నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విజయవాడలో కలకలం రేగింది. ఓ వైపు విజయవాడ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొన్న సమయంలో మహిళలపై ఇలాంటి వరుస సంఘటనలు జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల నిఘా వ్యవస్థ, పెట్రోలింగ్ సిస్టమ్ ఏమైందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.







