ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘కల్కి 2’ (Kalki) 2నుంచి నటి దీపికా పడుకోణె (Deepika Padukone) తప్పుకున్నట్టు వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) అధికారికంగా ప్రకటించింది. దీపిక వైదొలగడంతో, ఆమె పోషించిన ‘సుమతి’ (Sumathi) పాత్రలో ఎవరు నటించబోతున్నారు? అన్న చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘కల్కి 2898 AD’లో దీపిక పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. సైన్స్ ఫిక్షన్, పురాణ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆ పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) సృష్టించిన విశ్వంలో సుమతి కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాదు, కథను ముందుకు నడిపించే కీలక పాత్ర. ఇప్పుడు తెరకెక్కబోతున్న ‘కల్కి 2’లో సుమతి పాత్ర మరింత శక్తివంతంగా, కథలో ప్రధాన మలుపులను సృష్టించేలా ఉండబోతుందని టాక్. అందువల్ల దీపిక స్థానాన్ని భర్తీ చేసే నటి ఎంపికపై పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎవరు రానున్నారు?
దీపిక స్థానంలో బలమైన నటనతో పాటు గ్లామర్ కూడా కలిపిన నటి కావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ నుండి ఆలియా భట్, కియారా అద్వానీ, కృతీ సనన్, అలాగే దక్షిణాదినుంచి సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, నిత్యామీనన్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. సుమతి పాత్రలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ‘కల్కి 2’పై అంచనాలు మరింత పెరిగిన నేపథ్యంలో, మేకర్స్ త్వరలోనే కొత్త హీరోయిన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.








