‘సాక్షి’పై కేసులు.. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా సీరియ‌స్ రియాక్ష‌న్‌

'సాక్షి'పై కేసులు.. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా సీరియ‌స్ రియాక్ష‌న్‌

ఇటీవ‌ల సాక్షి పత్రిక ఎడిటర్‌ సహా ఆ దిన‌ప‌త్రిక‌ జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసు వ్యవస్థ వేధింపుల‌కు దిగుతోందని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ వార్తలను ప్రచురించినందుకే నలుగురు జర్నలిస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడాన్ని ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌ గౌత‌మ్ ల‌హిరి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నీర‌జ్ ఠాకూర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ప్రెస్‌క్ల‌బ్ ఆఫ్ ఇండియా ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రతిపక్ష పార్టీ ఓ నాయకుడు నిర్వహించిన ప్రెస్‌మీట్‌ వార్తను సాక్షి సహా పలు పత్రికలు ప్రచురించాయి. అయితే, కేవలం సాక్షి పత్రికను మాత్రమే టార్గెట్‌ చేస్తూ రెండు వేర్వేరు స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లలో క్రిమినల్‌ చట్టాలను సెలెక్టివ్‌గా, నిరాధారంగా వాడినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది.

“ఇది పత్రికా స్వేచ్ఛపై (ఆర్టికల్‌ 19 (1)(A)-(G)) రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించే ఉదాహరణ”గా పేర్కొంది. జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేసే పద్ధతి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నదని క్లబ్ తెలిపింది. పత్రికలపై వచ్చే వివాదాలు సివిల్‌ చట్టాల ద్వారా పరిష్కరించాల్సిందే కాని క్రిమినల్‌ చట్టాల ద్వారా జరగకూడదని మరోసారి స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, హైకోర్టు ఇప్పటికే జర్నలిస్టులకు తాత్కాలిక రక్షణ కల్పించి, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశించిన విషయం ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా గుర్తుచేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా ఓ విజ్ఞప్తి చేసింది. “ప్రజా ప్రయోజనార్థం కథనాలను రాసిన జర్నలిస్టులను బాధితులుగా చూడ‌కుండా, పోలీసులు చేపట్టిన ఈ దుర్మార్గాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలి” అని కోరింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం” అని లేఖ‌లో స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment