తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు అంశంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన విజిలెన్స్ రిపోర్టును మరోసారి పరిశీలించాలని వారు నిర్ణయించారు.
ఆ రిపోర్టు ప్రకారం, కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు లేకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థి సంఘాలు సదరు రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల ఆరోపణల ప్రకారం, కొన్ని కాలేజీలు ఫేక్ సిబ్బందిని చూపించి అనుమతులు పొందుతున్నాయి. తనిఖీలు సరిగా జరగకపోవడం వల్ల కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం ఈ విజిలెన్స్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే అక్రమాలకు పాల్పడిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఏ నిర్ణయానికి దారితీస్తాయో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.