సచివాలయంలోని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు యూరియా సమస్యపై స్పందించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అంగీకరించిన ఆయన, సరైన ప్రణాళిక లేకపోవడమే సమస్యకు కారణమని వ్యాఖ్యానించారు. “మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. యూరియా సమస్య వచ్చినప్పుడు సరిగా ప్లాన్ చేయాలి. ఏ రైతుకు ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. సరిగా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇష్యూ రాదు. నేను చెప్పాను కానీ, మీరు ఫాలో కాలేదు” అంటూ కలెక్టర్లపై బాధ్యతను మోపడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ప్రతి కట్ట యూరియా తగ్గిస్తే రూ.800 నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. రైతు నష్టపోకుండా, ప్రజల ఆరోగ్యం కాపాడే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో, గ్లోబల్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికపై కూడా సూచనలు చేశారు. “కొన్ని యూరప్ దేశాలు మన ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నాయి. ప్రజలు తినే ఫైన్ వెరైటీలు వేయాలి, లేకపోతే మార్కెట్ ఉండదు. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పంటల ఎంపికలో మార్పులు చేయాలి” అని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సూచించారు.