తిరుపతిలో నేటి నుంచి రెండు రోజులపాటు మహిళా సాధికారతపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల నుండి సుమారు 100కి పైగా మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఈ సదస్సు జరుగుతుంది.
సదస్సు ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. తిరుపతి నగరంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలు, సాంకేతిక సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్ర తదితర అంశాలపై విస్తృత చర్చ జరుగనుంది.
ఈరోజు సాయంత్రం మహిళా ప్రతినిధులు చంద్రగిరి కోటను సందర్శించనున్నారు. రేపు తిరుమల శ్రీవారి దర్శనం, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ దర్శనం కూడా ప్లాన్ చేశారు. సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారు.