‘హలో.. నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti)ని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన ఇల్లు (House) వచ్చిందా? దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా? ఇంటి శ్లాబ్ ఎక్కడి వరకు వచ్చింది? అధికారులు మీకు సహకరిస్తున్నారా?’ అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేరుగా మాట్లాడారు. గురువారం హైదరాబాద్ (Hyderabad)లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్‌డెస్క్, ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత లబ్ధిదారులతో ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముందుగా, వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం లబ్ధిదారురాలు ఒకరితో మాట్లాడారు. ‘మా ఇల్లు బేస్‌మెంట్ వరకు పూర్తయింది. కానీ ఇంకా బిల్లు రాలేదు’ అని ఆమె మంత్రికి చెప్పారు. దీనికి స్పందించిన మంత్రి, బేస్‌మెంట్ పూర్తయి ఎన్ని రోజులైంది, దాని ఫోటోలు అప్‌లోడ్ చేశారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఆధార్ నంబర్‌తో వివరాలను పరిశీలించి, ‘సోమవారం నాటికి మీ బ్యాంకు ఖాతాలో రూ. లక్ష జమ అవుతాయి’ అని హామీ ఇచ్చారు.