బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?

బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) పదవీకాలం ముగియడంతో, కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ (BCCI) ఎన్నికలు నిర్వహించనుంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లు. ఈ నిబంధన ప్రకారం, 70 ఏళ్ల రోజర్ బిన్నీ పదవీకాలం ఈ ఏడాది ప్రారంభంలోనే ముగిసింది. అక్టోబర్ 2022లో ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కొత్త అధ్యక్షుడి పేరును బీసీసీఐ ప్రకటించనుంది.

ఈ నేపథ్యంలో, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని, బీసీసీఐ కూడా ఆయన వైపు ఆసక్తి చూపిస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ ఊహాగానాలకు తెర దించుతూ, సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నిర్వహణ సంస్థ అయిన ఎస్.ఆర్.టి. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. “బీసీసీఐ అధ్యక్ష పదవికి సచిన్ టెండూల్కర్‌ను పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. బీసీసీఐ పదవిపై సచిన్‌కు ఎటువంటి ఆసక్తి లేదు. దయచేసి ఈ నిరాధారమైన ప్రచారాలను నమ్మవద్దు” అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో అన్ని వదంతులకు ముగింపు పడినట్లయ్యింది. సచిన్ టెండూల్కర్ తనకు ఎలాంటి పదవులపై ఆసక్తి లేదని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.

సెప్టెంబర్ 28న జరిగే ఏజీఎంలో బీసీసీఐ అధ్యక్షుడితో పాటు అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌ను కూడా నియమించనున్నారు. అదే సమావేశంలో ఐసీసీలో భారత ప్రతినిధిని కూడా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు సౌరవ్ గంగూలీ తర్వాత రోజర్ బిన్నీ ఈ పదవిని చేపట్టారు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో భారత్ తరపున 200 టెస్ట్‌లు, 463 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment