సినీ నటి హన్సికకు, ఆమె సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ పెట్టిన గృహ హింస కేసులో నిరాశ ఎదురైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తాజాగా తిరస్కరించింది.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి ముస్కాన్‌ను 2020లో వివాహం చేసుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో, తనను వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ముస్కాన్.. హన్సిక, ఆమె సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై గృహ హింస కేసు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ముంబై సెషన్స్ కోర్టు హన్సికకు, ఆమె తల్లికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసును పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ హన్సిక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో కేసు విచారణ కొనసాగనుంది.