‘దృశ్యం’ సిరీస్ తెలుగుతో సహా అనేక భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో భాగం రాబోతోంది. ‘దృశ్యం 3’ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే, ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. “దృశ్యం 3 ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ, రెండో భాగంలాగే అత్యంత తెలివైన సన్నివేశాలు ఉంటాయని ఆశించేవారు కొంత నిరాశ చెందవచ్చు. ఎందుకంటే ఈసారి స్క్రీన్‌ప్లే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గత నాలుగేళ్లుగా మోహన్‌లాల్ పాత్రలో చాలా మార్పులు చేశాం. ఆయన నా కళ్లలో ఎప్పుడూ జార్జ్ కుట్టీగానే ఉంటారు” అని జీతూ అన్నారు.
ఈ కథను యూరప్ ట్రిప్‌లో ఉండగా రాసుకున్నానని, దుబాయ్ ఫ్లైట్ ప్రయాణంలోనే సన్నివేశాల క్రమాన్ని సిద్ధం చేసుకున్నానని జీతూ వివరించారు. ఐదు రఫ్ కాపీలు రాసిన తర్వాత, వాటిని కెమెరామెన్, ఎడిటర్ సహా బృంద సభ్యులందరికీ ఇచ్చి, వారి సూచనల మేరకు మార్పులు చేశానని చెప్పారు. ముందుగా మోహన్‌లాల్ ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం జీతూ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.