దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో జరుగుతున్న ఈ ఎన్నికలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొలి ఓటు వేయడంతో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 771 మంది ఎలక్టోరల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. విజయం సాధించడానికి మ్యాజిక్ ఫిగర్ 386 ఓట్లు కావాలి.
ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచే ఓట్ల లెక్కింపు జరగనుంది. మోడీ ఓటు వేసిన అనంతరం ఇప్పటికే పలువురు ఎంపీలు వరుసగా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు సుమారు 439 మంది ఎంపీల మద్దతు లభించినట్లు సమాచారం. మరోవైపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ కు 324 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్‌ఎస్, బీజేడీ ఈ ఎన్నికకు దూరంగా ఉండటం గమనార్హం.
ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు
సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపులోనే దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలనుంది. ఇరు కూటములు తమ విజయం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అసలు ఫలితం కోసం అందరి చూపు లెక్కింపుపై నిలిచింది. క్రాస్ ఓటింగ్ జరిగితే తమకు కలిసొస్తుందని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు.