కొంతమంది తమ అభిమాన క్రీడాకారులు లేదా నటీనటులపై తమకున్న ప్రేమను విభిన్న రీతుల్లో వ్యక్తపరుస్తుంటారు. కానీ, ఒక అభిమాని తన ఆస్తి మొత్తాన్ని ఇష్టమైన ఆటగాడికి రాసివ్వడం చాలా అరుదు. అయితే, బ్రెజిల్ (Brazil)కు చెందిన ఒక 31 ఏళ్ల బిలియనీర్ తన యావదాస్తి (Entire Property)ని బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ (Neymar)కు వీలునామాగా రాశారు. సుమారు రూ. 10 వేల కోట్ల విలువైన ఈ ఆస్తిని తనకు ఎటువంటి సంబంధం లేని నెయ్‌మార్‌కు ఇవ్వడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
పోర్టో అలెగ్రే (Porto Alegre)కు చెందిన ఈ అభిమాని, తనకు పిల్లలు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నెయ్‌మార్‌ను తన తండ్రితో ఉన్న అరుదైన ప్రేమ, అనుబంధం తనకు బాగా నచ్చిందని, అందుకే అతడిని తన ఆస్తికి ఏకైక వారసుడిగా ఎంచుకున్నానని వివరించారు. ఈ వీలునామాను జూన్ 12, 2025న అధికారికంగా నమోదు చేశారు.
ఈ వార్త గురించి నెయ్‌మార్ ప్రతినిధులు మాట్లాడుతూ, తమకు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 33 ఏళ్ల నెయ్‌మార్, 2026 FIFA ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ వార్త మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.








