వాహనదారులు నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తారు. కానీ రోడ్లు సరిగా లేకపోతే అధికారులకు ఎవరు ఫైన్ వేస్తారని ఒక యువకుడు ప్రశ్నించాడు. ట్రాఫిక్ చలాన్లు కాదు, ముందు మీరు రోడ్లు సరిగా వేయండని డిమాండ్ చేస్తూ ఒక యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు.
కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో రోడ్డు పూర్తిగా పాడైపోయిందని, ఇది కరీంనగర్-నిజామాబాద్ జాతీయ రహదారి అయినప్పటికీ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాహనం నడపాలంటే భయంగా ఉందని శ్యామ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు పోలీసులు ఫైన్లు వేస్తున్నారని, కానీ తాను జీఎస్టీ, రోడ్డు టాక్స్ కడుతున్నప్పటికీ రోడ్లు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కలెక్టర్‌ను, పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నిస్తూ, “పాడైపోయిన ఈ రోడ్డుకు మీరు నాకు ఎంత ఫైన్ కడతారు?” అని ప్రశ్నించారు. ముందుగా మంచి రోడ్లు నిర్మించి, ఆ తర్వాతే ఫైన్లు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని శ్యామ్ కుమార్ కోరారు.







