భారీ వర్షాలు (Heavy Rains), వరదల కారణంగా తెలంగాణ (Telangana)లో గందరగోళ పరిస్థితి నెలకొంది. కామారెడ్డి (Kamareddy), కరీంనగర్ (Karimnagar) జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోడ్లన్నీ(Roads) కొట్టుకుపోగా, కొందరు వరదల్లో చిక్కుకుని రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. కాగా, కరీంనగర్ జిల్లా నర్మాల గ్రామంలో చిక్కుకుపోయిన ఐదుగురిని సురక్షితంగా కాపాడేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) రక్షణ శాఖ మంత్రికి ఫోన్ చేసి సహాయం కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు, రక్షణ శాఖ తక్షణమే నాలుగు ఆర్మీ హెలికాప్టర్ల (Army Helicopters)ను పంపింది. వాటిలో రెండు హెలికాప్టర్లు నర్మాల గ్రామంలో ఐదుగురిని సురక్షితంగా రక్షించాయి. మిగిలిన రెండు హెలికాప్టర్లను సిరిసిల్ల (Sirisilla)లో సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచారు.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన అనంతరం వరదల్లో గల్లంతైన నాగం కుటుంబాన్ని ఆయన పరామర్శించి, లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఈ సంఘటనల మధ్య, నర్మాల గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ బండి సంజయ్‌కు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్(KTR), కేంద్ర మంత్రి ఇద్దరు కరచాలనం (Handshake) చేసుకొని మాట్లాడుకున్నారు. తీవ్ర విమర్శలు చేసుకునే రాజకీయ ప్రత్యర్థులు.. ఇలా ఒకరినొకరు కలుసుకొని కరచాలనం చేసుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.







