దేశంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ (ఐటీఐలు)లో విద్యా విధానాన్ని అప్‌డేట్ చేస్తూ, ఇంజినీరింగ్ (Engineering), నాన్-ఇంజినీరింగ్ (Non-Engineering) కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా పదో తరగతి అర్హత కలిగిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్ కోర్సులు చదివే అవకాశం కలగడం ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
టాటా గ్రూప్‌తో 10 ఏళ్ల ఒప్పందం
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) టాటా గ్రూప్ (Tata Group)తో 10 ఏళ్లపాటు ఒప్పందం (Agreement) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశోధన, ప్రయోగాలకు అవసరమైన వనరులు, శిక్షణలు లభించనున్నాయి.
కొత్త కోర్సులు – ఆధునిక అవకాశాలు
ATCsలో ఇప్పటికే అనేక ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయి. వాటిలో ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, ఆటోమేషన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్, స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ స్మార్ట్ సిటీ టెక్నీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుడ్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ వంటివి ప్రధానమైనవి. ఈ కోర్సులకు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వ్యవధి ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, నిరుద్యోగాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం.
భవిష్యత్తు దిశ
ప్రస్తుతం రాష్ట్రంలో 25 ATCs, 63 ప్రభుత్వ ఐటీఐలు, 220 ప్రైవేట్ ఐటీఐలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు రాబోయే కాలంలో దేశ ఆర్థికాభివృద్ధికి, పరిశ్రమలకు అవసరమైన నైపుణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.