ఏపీలో ఘోరం.. ఆరు నెలల గర్భిణీ దారుణ హత్య

ఏపీలో ఘోరం.. ఆరు నెలల గర్భిణీ దారుణ హత్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలు భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. అన‌కాప‌ల్లి (Anakapalli) జిల్లాలో తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. విశాఖ శివారు ప్రాంతంలో సరుగుడు తోటలో సగం కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మ‌హిళ‌ మృతదేహం కలకలం రేపింది. పోలీసులు పరిశీలించగా, ఆమె ఆరు నెలల గర్భిణీ (Pregnant Woman) అని గుర్తించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం బంజరు వద్ద జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం, అనకాపల్లి-అనందపురం (Anakapalli–Anandapuram) జాతీయ రహదారికి సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న సరుగుడు తోటలో పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని, గిరిజన తెగకు చెందిన గర్భిణీ అని తేల్చారు.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
ఈ కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఆర్ఎఫ్ఎస్ఎల్ (RFSL) బృందాలను విశాఖ నుంచి రప్పించి కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహం కాళ్ళు, చేతులు తాడులతో కట్టి, గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వేరే చోట హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

మృతదేహం గుర్తింపు కోసం ప్రయత్నం
మృతదేహాన్ని గుర్తించడం కోసం పోలీసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మహిళల మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన మహిళ వివరాలు తెలుసుకునేందుకు ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని మూడు రోజుల పాటు అనకాపల్లిలోని ఎన్టీఆర్(NTR) ఆసుపత్రి(Hospital)లో గుర్తింపు కోసం ఉంచుతారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment