ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మక పాత్ర పోషించిన ప్రముఖ నేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) శిబూ సోరెన్ (Shibu Soren) ఇకలేరు. ఢిల్లీ గంగారాం (Delhi Gangaram) ఆసుపత్రి (Hospital)లో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చివరకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నాలుగు దశాబ్దాల సేవ
శిబూ సోరెన్ జీవితం ఆదివాసీ హక్కుల (Tribal Rights) సాధనకోసం సాగిన ఓ దీర్ఘయాత్ర. మూడుసార్లు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీగా ప్రజా ఆశీర్వాదంతో గెలుపొందారు. ఆదివాసీల భూముల, హక్కుల రక్షణకు ఎనలేని పోరాటం చేసిన శిబూ సోరెన్, రాష్ట్ర ఆత్మగౌరవానికి పాటుపడిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ స్థాపకుల్లో ఒకరు. ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవ కోసం పాటుపడిన శిబూ సోరెన్ మృతిపట్ల ఆ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
వారసత్వ బాటలో హేమంత్ సోరెన్
శిబూ సోరెన్ రాజకీయ వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం హేమంత్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తండ్రి శిబూ సోరెన్ మరణ వార్తతో తీవ్ర మౌనవేదనలో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార, విపక్ష నేతలు శిబూ సోరెన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ గంగారాం ఆస్పత్రిలో శిబూసోరెన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.