భారత హాకీ (India’s Hockey) వందేళ్ల (100 Years) పండుగను (Celebration) ఘనంగా నిర్వహించేందుకు హాకీ ఇండియా (HI) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ శత వసంతాల వేడుకల సందర్భంగా రాష్ట్ర హాకీ సంఘాలకు అందించే నిధులను గణనీయంగా పెంచింది. అంతేకాదు, సీనియర్, జూనియర్ అంతర్జాతీయ, జాతీయ, మహిళల టోర్నీల నిర్వహణ కోసం ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని కూడా భారీగా హెచ్చించింది. క్షేత్రస్థాయిలో జరిగే ఈవెంట్లను ప్రోత్సహించే దిశగా ఈ ఆర్థిక సాయాన్ని పెంచడం విశేషం.
ఆర్థిక చేయూతతో ఆటగాళ్లకు ప్రోత్సాహం
ఇకపై, ఏదైనా రాష్ట్రంలో పురుషుల, మహిళల సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్ జరిగితే రూ. 70 లక్షలు గ్రాంట్‌గా అందజేయనున్నారు. అదే జూనియర్, సబ్-జూనియర్ స్థాయి ఈవెంట్లను నిర్వహిస్తే రూ. 30 లక్షలు ఇవ్వనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది. దీనితో పాటు, రాష్ట్ర స్థాయి, జిల్లా టోర్నీల నిర్వహణ కోసం రూ. 25 లక్షలు ఇస్తామని తెలిపారు. నవంబర్ 7న దేశవ్యాప్తంగా హాకీ వందేళ్ల స్వర్ణోత్సవ సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భవిష్యత్తుకు భరోసా, మౌలిక సదుపాయాల బలోపేతం
నిధుల పెంపుదలతో ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు మరింత పెరిగేందుకు దోహదపడుతుందని హాకీ ఇండియా భావిస్తోంది. ఇది టోర్నీలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది. ఫలితంగా పోటీలు మరింత ఆకర్షణీయంగా మారతాయి, అదనపు హంగులతో నిర్వహించబడతాయి. నిష్ణాతులైన రిఫరీల, అధికారుల పర్యవేక్షణలో జరగడం వలన ఆట నాణ్యత కూడా పెరుగుతుంది. ఆటగాళ్లకు మెరుగైన వసతులు లభిస్తాయి.
ఈ ప్రోత్సాహకాలతో కొత్తగా మరెంతో మంది యువత హాకీని కెరీర్‌గా ఎంచుకుంటారని హాకీ ఇండియా బలంగా నమ్ముతోంది. ఇది కేవలం ఆటగాళ్లకే కాకుండా, హాకీ క్రీడ కోసం పనిచేసే అధికారులు, కోచ్‌లు, ఫిజియోలకు కూడా ఎంతో మేలు చేస్తుందని, వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని హెచ్ఐ అభిప్రాయపడింది.
ఒకేసారి 1000 మ్యాచ్‌ల నిర్వహణ – అరుదైన ఘనత
హాకీ వందేళ్ల మైలురాయి ఘనతకు గుర్తుగా జాతీయ స్థాయి వేడుకలే కాకుండా, ప్రత్యేక పోటీలు కూడా హాకీకి మరింత శోభను తేనున్నాయి. ‘హాకీ-100’ను చిరస్మరణీయం చేసేందుకు, మహిళలు, పురుషుల విభాగాల్లో ఒకేసారి దేశవ్యాప్తంగా వెయ్యి చొప్పున మ్యాచ్‌లను నిర్వహించేందుకు హాకీ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ అరుదైన పోటీల్లో మహిళల్లో, పురుషుల్లో 18 వేల మంది చొప్పున, మొత్తంగా 36 వేలమంది క్రీడాకారులు ఒకేసారి పాల్గొనబోతున్నారు. “మన హాకీ స్వర్ణ శకం వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా, భవిష్యత్ తరాలకు మన హాకీ ప్రభ, శోభ తెలిసేలా ఈ వందేళ్ల వేడుక ఉంటుంది” అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నారు.