అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిర్ ఇండియా (Air India) ప్రమాదాన్ని ప్రపంచం ఇంకా మరిచిపోకముందే.. వరుసగా జరుగుతున్న ఘటనలు విమాన ప్రయాణికులను భయపెడుతున్నాయి. తాజాగా అమెరికా (America)లోని డెన్వర్ (Denver) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో పెనుప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ (Boeing) 737 మాక్స్ విమానం (MAX Aircraft) (ఫ్లైట్ నెంబర్ AA3023) టేకాఫ్ సమయంలో ల్యాండింగ్ గేర్‌లో మంటలు (Flames) చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని రన్‌వేపై నిలిపివేశాడు. విమానంలో ఉన్న 173 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందిని తక్షణమే సురక్షితంగా బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.
డెన్వర్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, మధ్యాహ్నం 2:45 ప్రాంతంలో టేకాఫ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుండి మంటలు రావడం గుర్తించారు. ప్రమాదానికి టైర్ లేదా బ్రేకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపమే కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఐదుగురు ప్రయాణికులకు ప్రాథమిక వైద్యం అందించగా, ఒకరిని స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మంటలు అంటుకున్న విమానం నుంచి ప్రయాణికులు దిగుతున్న దృశ్యాలు చూసినవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.