పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (‘Hari Hara Veera Mallu’) చిత్రం రెండు రోజుల క్రితం థియేటర్లలో విడుదలైంది. అయితే, ప్రీమియర్‌ల నుండే మిశ్రమ స్పందనను పొందిన ఈ చిత్రం, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు (Gross Collections) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. నైజాం వంటి ఏరియాలలో ప్రీమియర్‌లతోనే రూ. 5 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో ఆల్ టైమ్ రికార్డ్ గ్రాస్‌తో ‘వీరమల్లు’ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.
రెండో రోజు భారీ డ్రాప్!
సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ (Negative Talk) వల్ల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకోవాలి. మొదటి రోజు కొంత పర్వాలేదనిపించినప్పటికీ, రెండో రోజు ‘వీరమల్లు’ భారీ డ్రాప్‌ను చవిచూసింది. అందిన సమాచారం ప్రకారం, కృష్ణా జిల్లాలో రూ. 27.82 లక్షల షేర్, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 16.55 లక్షల షేర్, నెల్లూరు జిల్లాలో రూ. 6 లక్షల షేర్, గుంటూరులో రూ. 19 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. మిగిలిన ప్రాంతాల్లో వివరాలు ఇంకా రావల్సి ఉంది.
ఇక, భారతదేశవ్యాప్తంగా రెండో రోజు కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజు రూ. 70 కోట్లు రాబట్టి, రెండో రోజు కేవలం రూ. 8 కోట్లు అంటే ‘వీరమల్లు’ భారీగా పడిపోయినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్సీస్‌లో కూడా భారీ డ్రాప్ (Huge Drop) కనిపించింది.








