టీమిండియా (Team India) మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి (Ravi Shastri) తన ఆల్‌టైమ్ గ్రేట్ టాప్-5 భారత క్రికెటర్ల జాబితాను వెల్లడించారు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్‌లతో కలిసి ‘ది ఓవర్‌లాప్’ (‘The Overlap’) క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రవిశాస్త్రి ఈ జాబితాను ప్రకటించారు. ఆయన ఎంచుకున్న ఆటగాళ్ళలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం.
ఐదుగురిలో నంబర్ వన్ ఎవరు అని అలిస్టర్ కుక్ అడగ్గా.. రవిశాస్త్రి వెంటనే సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పేరును ప్రస్తావించారు. “ఐదుగురిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. బ్యాటింగ్ పరంగా సన్నీ (సునీల్ గవాస్కర్) టాప్. కపిల్ దేవ్ అద్భుతమైన ఆటగాడు” అని రవిశాస్త్రి వివరించారు.
సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) గురించి మాట్లాడుతూ.. “అన్ని కోణాల్లో చూస్తే సచిన్ టెండూల్కర్ నంబర్ వన్ ప్లేయర్. 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. అతడి తరంలో ప్రతి ఒక్క పేస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొని 100 సెంచరీలు బాదాడు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్‌లతో పాటు జాక్వెస్ కలిస్, షాన్ పొలాక్, స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ వంటి టాప్ పేసర్లను అలవోకగా ఆడాడు” అని కొనియాడారు.
తన జాబితాలో బిషన్ సింగ్ బేడి ఉన్నప్పటికీ ఎంఎస్ ధోనీని ఎంచుకున్నానని రవిశాస్త్రి తెలిపారు. అలాగే, జస్ప్రీత్ బుమ్రా ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నందున అతన్ని ఎంచుకోలేనని స్పష్టం చేశారు.
రవిశాస్త్రి ఆల్‌టైమ్ గ్రేట్ టాప్-5 ఇండియా క్రికెటర్లు:
సునీల్ గవాస్కర్
కపిల్ దేవ్
సచిన్ టెండూల్కర్
ఎంఎస్ ధోనీ
విరాట్ కోహ్లీ