ఎన్నికల (Elections) ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) కొత్తగా సంతానోత్పత్తి (Reproduction) నినాదం (Slogan) ఎత్తుకున్నారు. జనాభా పెంపు (Population Increase ) విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. “ఒకరు ఉంటే ముద్దు, ఇద్దరు ఉంటే పర్వాలేదు, మూడు వద్దు అని చెప్పేవాళ్లం. కానీ ఇప్పుడు నేను అంటున్నా, ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని కన్నవాళ్లే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు. అలాంటి వారిని గౌరవిద్దాం” అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. నెటిజన్లు, ప్రజలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, కుటుంబ నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై నెటిజన్లు (Netizens) తీవ్రంగా స్పందిస్తూ.. “ప్రజలకు సూచనలు చేసే ముందు చంద్రబాబు తాను ఆచరించాలి. ఆయన కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh)కు ఎంతమంది సంతానం (Children) ఉన్నారు?” అని ప్రశ్నిస్తున్నారు. “ఎవరి కుటుంబ నిర్ణయాలు వారు తీసుకుంటారు. మీరు ఎంతమంది పిల్లలను కన్నారని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతారు?” అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. సంపాదన, ఆర్థిక స్థితిగతులను బట్టి దంపతులు పిల్లల సంఖ్యను నిర్ణయించుకుంటారని, ముగ్గురికి మించి పిల్లలను కనమని చెప్పడం ద్వారా వారి భవిష్యత్తు, పోషణ, పెంపకం వంటి బాధ్యతలను చంద్రబాబు లేదా లోకేష్ తీసుకుంటారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ఆయా కుటుంబాలకు గత ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో భరోసాగా, బాసటగా నిలిచిన ప్రఖ్యాత పథకాలను నీరుగార్చడమో, వాటిని ఎత్తివేయడమో చేశారన్న కామెంటులు, పోస్టింగులు సర్క్యులేట్ అవుతున్నాయి.
“పిల్లలు కనడం దేశభక్తికి గుర్తుగా ఎలా ఉంటుంది? పిల్లలు పుట్టనివారిని (Childless) దేశద్రోహులుగా (Traitors) జమ చేస్తారా?” అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ నిర్ణయాలను దేశభక్తి, గౌరవంతో ముడిపెట్టడం, ప్రభుత్వం వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ప్రజలు వాదిస్తున్నారు. “బిడ్డల్ని కనడం, కనకపోవడం దంపతుల వ్యక్తిగత ఇష్టం. ఎవరో ఒకరు ఎంతమందిని కనమని నిర్ణయించడం ఏమిటి?” అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది.
చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగానూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి. సంపద సృష్టి అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. “రాష్ట్రంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, మహిళల భద్రత వంటి సమస్యలపై చంద్రబాబు దృష్టి పెట్టకుండా, వ్యక్తిగత నిర్ణయాలపై సలహాలు ఇస్తున్నారు” అని విమర్శిస్తున్నారు. మరోవైపు, టీడీపీ నాయకుల్లోనూ చంద్రబాబు వ్యాఖ్యలు గందరగోళాన్ని సృష్టించాయి. “దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. దీని వల్ల భవిష్యత్తులో ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు” అని టీడీపీ నాయకులు అర్థంలేని అంశాలను తప్పుబడుతున్నారు.
ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. జనాభా వృద్ధి, దేశభక్తి వంటి సున్నితమైన అంశాలను రాజకీయ వేదికలపై చర్చించడం సముచితమేనా అనే ప్రశ్నపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.








