నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కుంభకోణంలో షాకింగ్ వివరాలు బయటపడుతున్నాయి. ఈ స్కాంలో వరంగల్ (Warangal)లోని ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ (Father Colombo Medical Hospital) పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది. ఈ కేసులో వరంగల్‌కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్ (Komireddy Joseph)పై సీబీఐ(CBI) కేసు (Case) నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీలకు సంబంధించి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలను తనిఖీ చేసి, వారికి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ కుంభకోణంలో మొత్తం 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పలువురు డాక్టర్ల పాత్రపైనా కేసులు పెట్టారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని మెడికల్ కాలేజీల తనిఖీలలోనూ అక్రమాలు జరిగినట్లు బయటపడింది. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు నిర్వహించి, డబ్బులు తీసుకున్నారని కొమిరెడ్డిపై ఆరోపణలున్నాయి.
సీబీఐ దర్యాప్తులో భాగంగా, మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమిరెడ్డికి రెండు దఫాలుగా డబ్బులు అందినట్లు తెలిసింది. విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజ్ (Gayatri Medical College) డైరెక్టర్ (Director) నుంచి రూ. 50 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. డాక్టర్ కృష్ణ కిషోర్ (Dr.Krishna Kishore) ద్వారా ఈ డబ్బును ఢిల్లీకి హవాలా రూపంలో తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ పొందేందుకు ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలుగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నానికి చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్‌లను మధ్యవర్తులుగా సీబీఐ గుర్తించింది. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు మొత్తం రూ. 60 లక్షలు ముట్టజెప్పినట్లు సీబీఐ నిర్ధారించింది.








