తుర్కియే (Turkey)లోని మధ్యధరా సముద్రతీరంలోని మార్మారిస్ (Marmaris) పట్టణంలో మంగళవారం (జూన్ 3) తెల్లవారుజామున 2:17 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ భూకంపం ప్రకంపనలు పశ్చిమ తుర్కియే (Western Turkey), దక్షిణ గ్రీస్ (Southern Greece’s)లోని రోడ్స్ దీవి (Rhodes Island), ఏజియన్ (Aegean) సముద్ర తీర ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. ఈ ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
తుర్కియే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) ప్రకారం, భూకంప ధాటికి ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీస్తూ కొందరు కిటికీలు, బాల్కనీల నుంచి దూకడంతో గాయాలయ్యాయి. అయితే, ప్రాథమిక నివేదికల ప్రకారం భవనాలకు గణనీయమైన నష్టం జరగలేదని, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలపై తాత్కాలికంగా ప్రభావం పడినట్లు సమాచారం. మరోవైపు, సమీపంలోని ఫెథియే పట్టణంలో ఒక 14 ఏళ్ల బాలిక భూకంప సమయంలో భయాందోళనతో గుండెపోటుకు గురై మరణించినట్లు తుర్కియే ఆంతరంగిక మంత్రి అలీ యెర్లికయా (Ali Yerlikaya) తెలిపారు.
తుర్కియే భౌగోళికంగా అనేక ఫాల్ట్ లైన్లపై ఉంది, ఇది భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది. ఈ భూకంపం మధ్యధరా సముద్రంలో ఉద్భవించినప్పటికీ, దాని ప్రకంపనలు గ్రీస్‌లోని డోడెకానిజ్ దీవుల్లో (Dodecanese Islands) 6.2 తీవ్రతతో భూకంపంతో సమానంగా మారాయి. భూకంపం సంభవించిన వెంటనే తుర్కియే ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగాలు అప్రమత్తమై, సహాయ చర్యలను ప్రారంభించాయి. గాయపడినవారికి వైద్య సహాయం అందించడంతో పాటు, ప్రాంతంలో స్థిరత్వాన్ని పరిశీలించేందుకు భవనాల తనిఖీలు చేపడుతున్నారు. అధికారులు ప్రజలను ప్రశాంతంగా ఉండాలని, అత్యవసర సేవల కోసం టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.








