”భార్గ‌వ‌ చికెన్.. ఇచ్చ‌ట‌ బేరాల్లేవ్‌” – ఆళ్ల‌గ‌డ్డ‌లో న‌యా దందా

allagadda-chicken-trade-coercion-controversy

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ (Allagadda) లో చికెన్ వ్యాపారం (Chicken Business) వివాద‌స్ప‌దంగా మారింది. తాము చెప్పిన కోళ్లే కొనుగోలు చేయాల‌ని, లేదంటే షాపులు మూసుకోవాలంటూ అధికార పార్టీకి చెందిన ఓ మ‌హిళా నేత దాదాగిరి చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఓ ఆడియో వైర‌ల్‌గా మారింది. త‌మ వ్యాపారాల‌ను కాపాడాల‌ని అధికారుల‌ను వేడుకున్నా ప‌ట్టించుకునే నాథుడు క‌రువ‌య్యార‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని చికెన్ వ్యాపారులు రోడ్డెక్కారు. ఈ వివాదం అధికార పార్టీని ఇరుకున‌ప‌డేయ‌గా.. త‌గ్గేదే లే అంటూ టీడీపీ నేత (TDP Leader) త‌మ టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు రంగంలోకి దిగారు.

ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏం జ‌రుగుతుందంటే..
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) భూమా అఖిలప్రియకు (Bhuma Akhila Priya) సన్నిహితురాలిగా పేరున్న రమీజ (Rameeza) అనే మ‌హిళ ఇటీవ‌ల‌ చికెన్ దుకాణ యజమానులను బెదిరించారు. మార్కెట్ ధర కంటే అధిక రేటుకు ఎమ్మెల్యే భ‌ర్త భార్గ‌వ‌రామ్ (Bhargava Ram) పేరుతో ఏర్పాటు చేసిన ‘భార్గవ చికెన్’ (Bhargava Chicken)ను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసింది, త‌మ కోళ్లు కొనుగోలు చేయ‌కుంటే షాపులు మూసివేయిస్తాన‌ని హుకుం జారీ చేసిన‌ట్లుగా చికెన్ షాపుల య‌జ‌మానులు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం రోజు రోజుకు తీవ్రం కావ‌డంతో మీడియాలో వార్త‌లు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. అయినా టీడీపీ నేత‌ల్లో ఎలాంటి మార్పు రాలేదు.

ఆడియో వైర‌ల్‌..
టీడీపీ మ‌హిళా నేత ర‌మీజ చికెన్ వ్యాపారుల‌ను బెదిరించిన ఓఆడియో క్లిప్ (Audio Clip) సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రమీజ ఒక చికెన్ దుకాణ యజమానిని బెదిరిస్తూ, “మా ఏజెన్సీ స్టాక్ లేకపోతే ANR నుంచి 10 కోళ్లు తీసుకున్నావా? రెండు కోళ్లైనా, పది కోళ్లైనా మా దగ్గరే తీసుకోవాలి, లేకపోతే షాపు మూసేస్తా” అని హెచ్చరిస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ ఆడియో ఎక్స్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. శనివారం హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ.180 ఉండగా, ‘భార్గవ చికెన్’ కిలో రూ.240కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది, అంటే కిలోకు రూ.60 అధికం. ఈ అధిక ధరలో రూ.30 ఎమ్మెల్యేకు, రూ.10 రమీజకు, రూ.15 టీడీపీకి, రూ.5 అధికారులకు చేరుతుందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. వ్యాపారులు, “అధిక ధరకు అమ్మితే నష్టపోయేది ప్రజలే కదా?” అని ప్రశ్నిస్తే, “మాకు ఇవ్వాల్సింది ఇచ్చి, మీ ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండి. మేము తప్ప ఎవరూ చికెన్ సరఫరా చేయలేరు” అని రమీజ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నో కేసు..
“డీఎస్పీకి చెప్పుకుంటారా, ఎస్పీకి ఫిర్యాదు చేస్తారా, చేసుకోండి.. నేను తగ్గను.. ‘భార్గవ చికెన్’నే అధిక ధరకు కొనాలి, లేకపోతే దుకాణాలు మూసేస్తా” అని టీడీపీ ఎమ్మెల్యే అండ‌తో ర‌మీజ బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని చికెన్ షాప్ య‌జ‌మానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఒత్తిడితో చాగలమర్రికి చెందిన చికెన్ వ్యాపారులు మే 15న (గురువారం) నంద్యాల జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఆళ్లగడ్డ డీఎస్పీని సంప్రదించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం టీడీపీ నాయకులు దుకాణాల ముందు కోళ్లను దించి, ‘భార్గవ చికెన్’నే విక్రయించాలని హుకుం జారీ చేశారని సమాచారం.

రూ.100 కోట్ల లక్ష్యం
ఆళ్లగడ్డలో చికెన్ వ్యాపారం చిన్నదిగా కనిపించినప్పటికీ, దీని వెనుక భారీ ఆర్థిక లక్ష్యం ఉందని స్థానిక చర్చలు జోరందుకున్నాయి. ఒక్క ఆళ్లగడ్డలో రోజుకు 5,000-6,000 కిలోల చికెన్ అమ్ముడవుతుంది, ఆదివారాలు, పండుగ సమయాల్లో 10,000 కిలోల వరకు పెరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా సగటున రోజుకు 15,000 కిలోలు విక్రయిస్తే, కిలోకు రూ.40 అధికంగా వసూలు చేస్తే, రోజుకు రూ.6 లక్షలు, నెలకు రూ.1.80 కోట్లు, ఏడాదికి రూ.21.5 కోట్లు, ఐదేళ్లలో రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఈ ‘భార్గవ చికెన్’ పథకం గత 10 రోజులుగా నంద్యాల జిల్లా పట్టణాలు, గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ, సామాజిక ప్రభావం
ఈ వివాదం ఆళ్లగడ్డలో రాజకీయ రీత్యా తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అండ‌తో రమీజ చేస్తున్న ప‌నులు పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. “ఆళ్లగడ్డలో చికెన్ దందా, సామాన్యుల జేబులు ఖాళీ” అని సోష‌ల్ మీడియాలో విమర్శలు వ్య‌క్తం చేస్తున్నారు. “బెదిరింపులతో వ్యాపారులను అణచివేస్తే ఇది ప్రజాస్వామ్యమా?” అని ప్రశ్నిస్తున్నారు. ఆళ్లగడ్డలో ‘భార్గవ చికెన్’ పథకం చుట్టూ జరుగుతున్న బెదిరింపులు, అధిక ధరల ఒత్తిడి స్థానిక వ్యాపారులను, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు ఈ ఆరోపణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఆళ్లగడ్డ రాజకీయాలను, స్థానిక ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment