ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాక ముందుగానే ప్రారంభమైంది. ఇప్పటికే దక్షిణ అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ ఋతుపవనాలు కేంద్రికృతమై ఉన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నుంచి నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించనున్నాయి. ఈ నెల ముగింపు నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం – వర్ష సూచనలు
తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, దానికి అనుసంధానంగా దక్షిణ ఒడిశా తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో వర్షాల పడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు పడతాయి. రేపటి నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. సముద్ర పరిస్థితులపై గమనిస్తున్న వాతావరణ కేంద్రం, మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని సూచనలు ఇస్తోంది. రాబోయే రోజుల్లో తుఫాను వంటి పరిస్థితులు ఏర్పడతాయా? అనే విషయంపై మౌలికంగా విశ్లేషణలు జరుగుతున్నాయి.