పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వీర జవాన్ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాలో అంత్యక్రియలు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో మరణించిన ఆర్మీ జవాన్‌కు రాష్ట్రమంతా నివాళులర్పించింది. ఆదివారం మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలను ఆర్మీ అధికారులు పూర్తిచేశారు. జాతీయ జెండాను, మురళీ నాయక్ ఆర్మీ దుస్తులను తల్లిదండ్రులకు అందించి ఆర్మీ అధికారులు, వీరుడిని కన్న ఆ తల్లిదండ్రులకు సెల్యూట్ చేశారు.
నివాళులర్పించిన ప్రముఖులు
పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్‌కు నివాళులర్పించేందుకు ప్రముఖులంతా కళ్లితండాకు చేరుకున్నారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. మరో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కూడా కళ్లితండాకు చేరుకొని మురళీనాయక్‌కు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించి, జవాన్ తల్లిదండ్రులను ఓదార్చారు.
రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా..
మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని అదే విధంగా 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు క్యాబినెట్‌లో చర్చించి ఆమోదిస్తామన్నారు. తన వ్యక్తిగతంగా జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాలో వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి
— Telugu Feed (@Telugufeedsite) May 11, 2025
సైనిక లాంఛనాలతో వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించిన ఆర్మీ అధికారులు#IndiaPakistanWar #IndianArmy #IndiaPakistanWar2025 #MuraliNaik pic.twitter.com/OxFIwJ2mFG








