ఐదున్నర దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్‌కు ఆపదొచ్చింది. 1969 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి అత్యంత కరువు పరిస్థితులు ఎదుర్కొనే ప్రాంతంలోనూ ఆర్డీటీ అందించిన సేవలు చిరస్మరణీయం. అలాంటి ట్రస్ట్‌కు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మనుగడకు విదేశీ నిధులే కీలకం. ఆర్డీటీ సంస్థకు సంబంధించి నిధుల వినియోగానికి అవసరమైన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ (ఎఫ్‌సీఆర్) యాక్ట్ కింద అనుమతులు పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సంస్థ సేవలు ఒక్కొక్కటిగా నిలిచిపోయే పరిస్థితి వస్తోంది. అయినా ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆర్డీటీ ప్రస్థానం..
పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బార్సిలోనాలో జన్మించి, స్పానిష్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి తెలుగు గడ్డపై కాలుమోపిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటీ సంస్థ ద్వారా అనంతపురం జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆరు జిల్లాల్లో ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్డీటీ గురించి తెలియని వారు ఉండరు. మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వంటి కరువు ప్రాంతంలో ఆర్డీటీ అందిస్తున్న సేవలు చిరస్మరణీయం. 1969లో ఆర్డిటీని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించగా ఈ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. 2009లో ఫాదర్ విన్సెంట్ ఫెర్టర్ కన్నుమూశాక ఆర్డీటీ నిర్వహణను ఆయన సతీమణి అన్నే ఫెర్రర్, వారి కుమారుడు మాంఛ్ ఫెర్రర్ నడిపిస్తున్నారు.
కరోనా సమయంలోనూ విశేష సేవలు..
ఆర్డీటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా దాదాపు 3,500 గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి పనులను, కుటుంబాల ఆదాయం పెంచే పనులు చేస్తోంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 4.5 లక్షలకు పైగా ప్రజలు సేవలందుకుంటున్నారు. విద్య, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సమాజ ఆరోగ్య అభివృద్ధి కోసం క్రీడలను నిర్వహిస్తోంది. జిల్లా నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సంస్థల మన్ననను ఆర్డీటీ సంస్థ పొందింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు, వికలాంగులకు వేలసంఖ్యలో పక్కా గృహాలను నిర్మించి ఇచ్చింది. ఇప్పటి వరకు 84,791 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. కరోనా సమయంలో ఎందరో పేద ప్రజలకు ఆర్డీటీ ఆయువు పోసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రతి సంవత్సరం 8.5 లక్షల మంది రోగులకు సేవలు పొందుతున్నారు. ఆర్డీటీ సంస్థ బత్తలపల్లి, కణేకల్లు, కళ్యాణదుర్గంలలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఏటా లక్షల మంది అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తోంది.
ఆర్డీటీ సంస్థకు కష్టమొచ్చింది..
ఆర్డీటీ సంస్థకు సంబంధించి నిధుల వినియోగానికి అవసరమైన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ (ఎఫ్‌సీఆర్) యాక్ట్ కింద అనుమతులు పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సంస్థ ఇబ్బందుల్లో పడింది. సంస్థ సేవలు ఒక్కొక్కటిగా నిలిచిపోయే పరిస్థితి వస్తోంది. తాజాగా పేద ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఏటా ఆర్డిటీ నిర్వహిస్తున్న ఆర్డీటీ సెట్ రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఆటంకం కలుగుతుంది. ఇలాంటి తరుణంలో దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్న ఆర్డీటిని రక్షించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి లేఖ ద్వారా కోరారు.
చంద్రబాబుకు విజ్ఞప్తి
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ అందిస్తున్న సేవలు తెలియనివి కావని, తక్షణమే ఆర్డీటీ సేవలు పునరుద్ధరించేలా, ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అనంతపురం జిల్లా వాసిగా అనంత వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.