వంటింటి ఖర్చు మళ్లీ పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సిలిండర్ (Cylinder) ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ (LPG gas) ధరను ఏకంగా రూ. 50 పెంచుతూ షాకిచ్చింది. ఉజ్వల పథకం (Ujjwala scheme) కింద ఇచ్చే సబ్సిడీ సిలిండర్లపై కూడా ఇదే ధర పెంపు వర్తించనుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ పెంపుతో ప్రస్తుతం ఢిల్లీ (Delhi)లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 803కి చేరింది. ముంబైలో రూ. 802.50, కోల్‌కతాలో రూ. 829, చెన్నైలో రూ. 818.50గా ఉంది. గతంలో వాణిజ్య గ్యాస్ ధరల్లో మార్పులు జరిగినప్పటికీ, గృహ వినియోగం కోసం ఇచ్చే సిలిండర్ ధర చివరిసారిగా ఆగస్టు 2024లోనే సవరించారు.
ఇక పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాలపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకాన్ని ప్రతి లీటరుపై రూ. 2 చొప్పున పెంచారు. అయితే ఈ పెంపు సామాన్యులపై పెద్దగా ప్రభావం చూపదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.