నగరంలో ఒకే కుటుంబానికి (Family) చెందిన ఆరుగురు (Six members) గల్లంతైన ఘటన చర్చనీయాంశంగా మారింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. న్యూ బోయిన్‌పల్లిలో ఏడుగుళ్ల (Eedugula) సమీపంలో నివసించే మహేశ్ (Mahesh), ఉమా (Uma) దంపతులు, వారి ముగ్గురు పిల్లలు (Three Children) రిషి, చైతు, శివన్‌తో పాటు సంధ్య అనే కుటుంబ సభ్యురాలు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు (Disappeared).
మహేశ్ స్థానికంగా ఉన్న నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ (Operator)గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సంధ్య వారి ఇంటికి వచ్చిన తర్వాత ఆరుగురూ కలిసి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఉమా సోదరుడు భిక్షపతి (Bhikshapathi) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ ఫుటేజీలో చివరిసారి ఎంజీబీఎస్ వద్ద
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఆరుగురూ ఆటో బుక్ చేసుకొని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్ (MGBS) బస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. అయితే అక్కడి నుంచి వారు ఎటు వెళ్లారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ దిశగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల సహాయంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.