కర్ణాటక (Karnataka) లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ (BJP) నుంచి బహిష్కృతులైన ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ (Basangouda Patil Yatnal) రాష్ట్రంలో కొత్తగా “హిందూ పార్టీ (Hindu Party)” ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో, ముఖ్యంగా బీఎస్ యడ్యూరప్ప (BS Yediyurappa) వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించిన ఆయన, త్వరలో కొత్త పార్టీని స్థాపించనున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.
యత్నాల్ తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. “కర్ణాటకలో హిందువులు సురక్షితంగా లేరు” అని వ్యాఖ్యానించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా హిందూ కార్యకర్తల నుంచి కొత్త పార్టీ కోసం విస్తృత మద్దతు లభిస్తోందని తెలిపారు. అయితే, తాను బీజేపీ లేదా ప్రధాని మోదీ (Modi) కి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీజేపీని ఇప్పటికీ తల్లి పార్టీగా భావిస్తున్నానని చెప్పారు.
సస్పెన్షన్ వెనుక అసలు కథేంటి?
పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించిన కారణంగా యత్నాల్‌ను ఇటీవల బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆయనను ఆరు సంవత్సరాల (6 Years) పాటు సస్పెండ్ (Suspended) చేసినట్లు హైకమాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయం తనకు అన్యాయంగా జరిగిందని యత్నాల్ ఆరోపించారు. “సర్దుబాటు రాజకీయాలు” బీజేపీని దెబ్బతీస్తాయని, అవినీతిని ప్రోత్సహించే వారిని తొలగించకపోతే, ప్రజల విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు.