తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారనే కారణంగా రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అప్పట్లో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
తప్పుడు సెక్షన్లు – హైకోర్టు సీరియస్
ఈ కేసును రద్దు చేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయన తరఫు న్యాయవాది జన్వాడ ప్రాంతం నిషిద్ధ ప్రాంతం కాదని, పోలీసులు అనవసరంగా కేసు పెట్టారని వాదించారు. ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్ కూడా డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని కోర్టుకు తెలియజేయడంతో, హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. కోర్టు తీర్పుతో 2020 నుండి వివాదాస్పదంగా మారిన ఈ కేసు ఎట్టకేలకు ముగిసినట్లయింది.