చలికాలం మెల్లగా జారుకుంది. వేసవి కాలం స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా జోరందుకున్న ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే మాడ పగలగొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగకు భయంతో అవసరం ఉన్న వారు మినహా ఎవరూ బయట తిరగడం లేదు. ఎండల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సీనియర్ మెట్రోలజీ ప్రొఫెసర్ రామకృష్ణ ఆసక్తికర వివరాల వెల్లడించారు. గడిచిన వందేళ్ళ కంటే ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ఏడాది 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని చెప్పారు. గాలిలో తేమ శాతం తగ్గుతుందని, తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. ఫీల్ లైక్ టెంపరేచర్ ఉంటుందన్నారు.
భూమి వాతావరణానికి సముద్ర వాతావరణానికి మధ్య వ్యత్యాసం తగ్గిపోతుందని ప్రొఫెసర్ రామకృష్ణ వెల్లడించారు. ఏప్రిల్ నెల నుంచి తీవ్ర వడగాల్పులు ఉంటాయని హెచ్చరించారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలతో సమానంగా కోస్తాలో కూడా ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సలహా ఇచ్చారు.