ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మిగిల్చిన బాధలను ఇంకా మరువకముందే.. ఇప్పుడు మరో కొత్త వైరస్ చైనాలో కలకలం సృష్టిస్తోంది. కోవిడ్‌కు మూలమైన చైనా దేశంలోనే మరో వైరస్ జనాన్ని భయపెడుతోంది. చైనాలోని ప్రజలు కొత్త వైరస్ కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాన్యు మో వైరస్ (HMPV). ఇది ప్రధానంగా శ్వాసకోశ వ్యాధిని కలిగిస్తుంది. కొవిడ్-19 లక్షణాలకు దగ్గరగా ఉండే ఈ వైరస్ సోకినవారు తీవ్రమైన జ్వరంతో, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.
చైనాలోని ఆస్పత్రులు ఇప్పటికే ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్-19 రోగులతో నిండిపోయాయి. దీనితో పాటు HMPV వైరస్ సోకిన వారి సంఖ్య కూడా పెరుగుతుండటం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.
HMPV వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితి గురించి వైద్యులు ఇంకా లోతుగా పరిశోధనలు మొదలుపెట్టారు. కాగా, ఈ వైరస్ ప్రాథమికంగా చిన్న పిల్లలు, వృద్ధులలో తీవ్ర ప్రభావం చూపుతోందని సమాచారం. దీనితో చైనా ఆరోగ్యశాఖ అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి రావచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి.
HMPV వైరస్ లక్షణాలు
ఈ వైరస్ సోకినవారు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారినపడతారు. ప్రస్తుతం HMPV నివారణకు టీకాలు అందుబాటులో లేవు. కానీ, మాస్క్‌లు ధరించడం, చేతులను తరచుగా కడుక్కోవడం, మరియు సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు వలన వ్యాప్తిని నియంత్రించవచ్చు. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో చైనా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యశాఖ ప్రజలను మరింత జాగ్రత్తగా ఉండమని సూచిస్తోంది.