కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎవరూ ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదుకావడం అధికార వర్గాలను, అభ్యర్థుల మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వ్యక్తి పేరు గురజా ప్రకాష్‌రాజు.. ఇతని పేరు మీద 42 ఓట్లు ఉన్నాయి. ఓటర్ జాబితాలో వయసు వేర్వేరు, డోర్ నంబర్లు వేర్వేరుగా, తండ్రి పేరు ఒక్కొక్కటి భిన్నం, బూత్ వివరాలు ఒక్కోసారి వేర్వేరుగా నమోదయ్యాయి.
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప పురపాలిక పరిధిలో చోటుచేసుకున్న ఈ అంశంపై PDF అభ్యర్థి మద్దతుదారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఓటర్ల జాబితా పరిశీలన, తయారీపై ప్రజల్లో అనుమానాలు తీవ్రమయ్యాయి.
వేర్వేరు ఇంటి నంబర్లతో 42 చోట్ల ఓటర్‌గా నమోదైన గురజా ప్రకాష్‌రాజు అసలు ఎవరు? అనే ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. అభ్యర్థుల ప్రతినిధులు ఈ పేరుపై ఉన్న వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు ఓటర్ల జాబితాలోని 42 ఇంటి అడ్రస్‌లకు వెళ్లి వెతికినా గురజా ప్రకాష్‌రాజు ఫలితం లభించలేదు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల మద్దతుదారులు అవాక్కు అవుతున్నారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్, సంబంధిత అధికారుల చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఒకే వ్యక్తికి 42 ఓట్లు ఉండడంతో ఎన్నికల అధికారుల తీరుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ ఇటీవల ఓటర్ల నమోదు ప్రక్రియను ఉధృతంగా నడిపింది. అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయిన వారందరి అడ్రస్‌లు తెలుసుకొని దగ్గరుండి మరీ వారి చేత దరఖాస్తులు చేయించింది.