తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తిరుమలలో జరిగిన అగ్నిప్రమాదం, తొక్కిసలాటలో మృతి వంటి ఘటనలపై కేంద్రం స్పందించడాన్ని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ భయంతో అడ్డుకున్నారని ఆరోపించారు.
“కేంద్ర ఉత్తర్వుల వెనుక రాజకీయం”
కేంద్రం తొలుత టీటీడీలో జరుగుతున్న వరుస ఘటనలపై సీరియస్ అయ్యిందని, సమీక్షకు కేంద్ర బృందాన్ని పంపిస్తున్నట్లుగా ప్రకటించిందన్నారు. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని భూమన గుర్తుచేశారు. అయితే, అమిత్ షా ముందు సాగిలపడి, ప్రాధేయపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్లుగా మరో ప్రకటన చేయించుకున్నారు. తిరుమలపై జరిగే సమీక్షలను నిరోధించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని భూమన విమర్శించారు. లేఖలను అడ్డుకున్నా.. చేసిన తప్పుకు శ్రీవారి దృష్టినుంచి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.
తిరుమలలో అపచారాలు
తిరుమలలో మద్యం, మాంసాహారం తరలింపు పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవల భక్తులు బిర్యానీ తింటున్న ఘటన వెలుగుచూసిందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు టీటీడీ అధికారులు, చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. టీటీడీలో టిక్కెట్ల అక్రమ విక్రయం, ఉద్యోగుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఘటనలను మంత్రి పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
ఒక చానెల్ నడుపుతున్న వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని, ఆలయ నిర్వహణ, సామాజిక బాధ్యత, భక్తుల సేవ పట్ల చిత్తశుద్ది, సంప్రదాయాల పట్ల గౌరవం లేని వ్యక్తులకు ఇటువంటి బాధ్యతలు అప్పగించారని భూమన ఆరోపించారు. అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి స్వామి వారి కన్నా చంద్రబాబు, లోకేష్ సేవలకే పరిమితమయ్యారు. వారు సిఫారస్ చేసిన వారికి వీఐపీ దర్శనాలు చేయించడమే ఆయన పని చేస్తున్నారన్నారు. తిరుమల ఘటనలపై జ్యుడీషియల్ విచారణ చేయాలని భూమన కరుణాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. టీటీడీకి పవిత్రతను తీసుకొచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.