ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన ఈరోజు ఉదయం సచివాలయంలో సమావేశం జరగనుంది. ముఖ్యమైన అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హాజరవుతారు. గోషామహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ప్రారంభించాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు. అదే విధంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎక్సైజ్ శాఖపై సమీక్ష, సాయంత్రం 5 గంటలకు విద్యుత్ శాఖ పనితీరుపై సీఎం రేవంత్ సమీక్ష జరపనున్నారు.
కొత్త ఆస్పత్రి ప్రత్యేకతలు
గత సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలక సూచనలు చేశారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి నిర్మాణానికి రూపకల్పన చేశారు. మెరుగైన రహదారులతో ఆసుపత్రికి చుట్టుపక్కల సౌకర్యవంతమైన కనెక్టివిటీ, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆసుపత్రి చేరుకునే మార్గాల అభివృద్ధి చేపట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించనున్నారు.