యెమెన్ లోని బైదా ప్రావిన్స్‌లో శనివారం ఒక గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు, ఇంకా 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పలువురి ఆచూకీ గల్లంతైనట్లుగా సమాచారం. రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు, కానీ ఆన్‌లైన్‌లో వచ్చిన ఫుటేజ్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటలతో వాహనాలు ధ్వంసమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత..
ఈ పేలుడు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల సమయంలో సంభవించింది. ఇజ్రాయెల్, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ హౌతీలు పెద్ద దాడులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో హౌతీలు ఇజ్రాయెల్ మీద అనేక పెద్ద దాడులు నిర్వహించారు.