రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India – RBI) రూ.2000 నోట్లకు (Notes) సంబంధించి కీలక ప్రకటన (Announcement) చేసింది. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ నోట్లను చలామణి నుండి ఉపసంహరించినప్పటికీ, ప్రజల వద్ద ఇంకా పెద్ద ఎత్తున రూ.2000 నోట్లు మిగిలి ఉన్నాయని RBI వెల్లడించింది. తాజాగా సోమవారం (జూన్ 2) విడుదల చేసిన ప్రకటనలో రూ. 6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉండటం విశేషంగా పేర్కొంది. 2023 మే 19న RBI ఈ నోట్లను అధికారికంగా చలామణి నుండి ఉపసంహరించిన సంగతి తెలిసిందే.
98.26 శాతం నోట్లు రికవరీ..
ఆర్బీఐ(RBI) పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించిన మొదట్లో రూ.2000 నోట్లను తిరిగి జమ చేసేందుకు దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ప్రజలు బారులు తీరారు. ఫలితంగా 2023 మే 19 నాటికి మొత్తం రూ.2000 నోట్లలో 98.26 శాతం వరకు తిరిగి వచ్చాయని RBI వెల్లడించింది. కానీ, ఇప్పటికీ రూ. 6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉండటం ఆందోళన కలిగించే విషయం.
ఆర్బీఐ కీలక ప్రకటన..
ఇప్పటికీ ఎవరి వద్దనైనా రూ.2000 నోట్లు మిగిలి ఉంటే, వాటిని వెంటనే పోస్టాఫీసుల (Post Offices) ద్వారా మార్చుకోవచ్చని RBI స్పష్టం చేసింది. అయితే ఈ మార్పిడి ఆప్షన్ ఎప్పటి వరకూ అందుబాటులో ఉంటుంది అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. దీని ద్వారా కేంద్ర బ్యాంక్ ప్రజల వద్ద మిగిలిన నోట్లను తిరిగి సేకరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.