బైక్ టాక్సీ సేవల్లో తనదైన ముద్ర వేసుకున్న ర్యాపిడో (Rapido) ఇప్పుడు మరో కీలక రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం రైడ్ షేరింగ్ మాత్రమే అందిస్తున్న ఈ యాప్, వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ (Online Food Delivery) రంగంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే పలు రెస్టారెంట్ల నిర్వాహకులతో ర్యాపిడో ప్రతినిధులు సమావేశమై సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌పై జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) ల ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, వీటికి గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ర్యాపిడో తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోందని సమాచారం.
2015లో బైక్ టాక్సీ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన ర్యాపిడో, కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా రైడ్ షేరింగ్ రంగంలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోనూ అదే స్థాయిలో విజయాన్ని సాధించేందుకు ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ర్యాపిడో కొత్త వ్యాపార ప్రణాళిక ఎలాంటి మార్పులను తెస్తుందో, వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో చూడాలి.