గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ స్థాపన నుంచి వైఎస్ జగన్ అనుసరించిన విలువలు, నిబద్ధతతో కూడిన నాయకత్వం ఆయనకు మాత్రమే సొంతం అన్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. జగన్ నాయకత్వం భారత రాజకీయాల్లో విశిష్టమైనది అని ప్రశంసించారు.
పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసిన నాయకత్వం
జగన్ తన ఐదేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంది పలికారన్నారు సజ్జల. ఆయన పాలన కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాలేదని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని దృఢమైన పునాదులతో కూడిన విధానాలను అమలుచేశారని గుర్తుచేశారు.
వైఎస్ జగన్ అందించిన పథకాలు, వాటి అమలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండటం విశేషమన్నారు. విద్యార్థుల కోసం అమలుచేసిన పథకాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఆధునిక కార్యక్రమాలు ఆయనకు ప్రజల మద్దతును మరింతగా పెంచాయి. జగన్ తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పుట్టిన రోజు వేడుకలు
నేడు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, మరింత ప్రజా సేవల ద్వారా దేశంలో ఆదర్శ నాయకుడిగా నిలవాలని కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ వంటి విజనరీ నాయకుడు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్న కోట్లాది మంది అభిమానులు ఆయన పుట్టినరోజును పండుగలా జరుపుకున్నారు.