తిరుపతి (Tirupati)లోని మోహన్ బాబు (Mohan Babu) యూనివర్సిటీ (University)పై ఏపీ ఉన్నత విద్యా కమిషన్ (AP Higher Education Commission) భారీ జరిమానా(Heavy Fine) విధించిందని, విశ్వవిద్యాలయం గుర్తింపు రద్దుకు సిఫారసు చేసిందన్న వార్త సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రో.ఛాన్స్‌లర్‌గా ఉన్న మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. కొందరు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న వార్తలను విశ్వవిద్యాలయ ప్రో-ఛాన్సలర్ విష్ణు మంచు తీవ్రంగా ఖండించారు. తన లేఖలో మీడియా ప్రచారం “తప్పుడు, తప్పుదోవ పట్టించే, ఉద్దేశపూర్వకమైనది” అని పేర్కొన్నారు.
“ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (APHERMC) చేసిన సిఫార్సులపై హైకోర్టు ఇప్పటికే ‘స్టే’ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను ధిక్కరించి, అదే సిఫార్సులను కమిషన్ తమ పోర్టల్‌లో ఉంచడం చట్టవిరుద్ధం” అని తెలిపారు. “APHERMC చేసిన సిఫార్సులు సరైనవి కావని మా విశ్వవిద్యాలయం గట్టిగా నమ్ముతోంది. హైకోర్టు నుండి మాకు న్యాయం లభిస్తుందని విశ్వాసం ఉంది. అయినా కూడా, కొందరు మీడియా సంస్థలు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారు. దయచేసి అలాంటి నిరాధార వార్తలను నమ్మవద్దు” అని ఆయన తల్లిదండ్రులు, విద్యార్థులు, భాగస్వాములకు విజ్ఞప్తి చేశారు.
1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపననుంచి ఈ సంస్థ సామాజిక బాధ్యతను కొనసాగిస్తోందని ఆయన వివరించారు. “పేద విద్యార్థులకు ఉచిత విద్య, పోలీస్, ఆర్మీ సిబ్బంది పిల్లలకు స్కాలర్‌షిప్లు, అనాథలకు విద్యా సంరక్షణ వంటి సేవలను కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ, కొందరు దురుద్దేశంతో మా సేవలను విమర్శిస్తున్నారు” అని అన్నారు.
తన ప్రకటనలో విష్ణు మంచు, “విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్సిటీ అధికారులు పూర్తి సహకారం అందించారని అదే కమిషన్ నివేదిక పేర్కొంది. దీని ద్వారా ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టమవుతోంది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులకు ధన్యవాదాలు. మా గౌరవనీయ ఛాన్సలర్ డాక్టర్ ఎం. మోహన్ బాబు మార్గదర్శకత్వంలో ప్రపంచ స్థాయి విద్య అందించే ప్రయత్నం కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.








