సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో (Visakhapatnam) హోటల్ రంగం సంక్షోభంలో పడింది. ఒకవైపు గ్యాస్ కొరత (Gas Shortage),, మరోవైపు పౌరసరఫరాల శాఖ (Civil Supplies) అధికారుల దాడులతో హోటళ్ల నిర్వహణ భారంగా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ హోటల్స్ అసోసియేషన్ (Visakha Hotels Association) అత్యవసరంగా సమావేశమై, ప్రభుత్వం తమకు సహకరించకపోతే హోటళ్లను మూసేయడానికి (Close the Hotels) కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసింది.
అధికారుల తీరుపై ఆగ్రహం
గత కొద్దిరోజులుగా సివిల్ సప్లైస్ అధికారులు హోటళ్లపై వరుస దాడులు నిర్వహిస్తున్నారు. గ్యాస్ ఎక్కువగా వాడుతున్నారనే సాకుతో వేధింపులకు గురిచేస్తున్నారని అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. హోటళ్లలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ సిలిండర్లు ఉన్నాయంటూ వాటిని బలవంతంగా పట్టుకెళ్లిపోతున్నారని ఆరోపించారు.
“కట్టెల పొయ్యిపై వంట చేయడం అసాధ్యం”
అధికారుల సూచనలు విడ్డూరంగా ఉన్నాయని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. “గ్యాస్ వాడకం తగ్గించి, కట్టెల పొయ్యిలపై వంట చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. విశాఖ లాంటి మెట్రో సిటీలో, కట్టెల పొయ్యిలపై వంట చేయడం అసాధ్యం. దీనివల్ల కాలుష్యం పెరగడమే కాకుండా, నగర నిబంధనలకు విరుద్ధం. హోటల్ నడవాలంటే గ్యాస్ తప్పనిసరి. గ్యాస్ కొరత ఉన్న సమయంలో సహకరించాల్సింది పోయి, దాడులు చేయడం ఏంటి?” అని ప్రశ్నించారు.
ప్రభుత్వం స్పందించాలి.. లేదంటే మూసేస్తాం!
ప్రభుత్వం, అధికారులు తమకు సహకరించకపోతే హోటళ్లను నడపడం సాధ్యం కాదని అసోసియేషన్ స్పష్టం చేసింది. అధికారుల వేధింపులు ఇలాగే కొనసాగితే, తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసేస్తామని హెచ్చరించారు. “ప్రభుత్వమే నేరుగా హోటళ్లు మూసేయమని చెబితే, మేము ఖాళీ చేసి వెళ్లిపోతాం. కానీ ఇలాంటి వేధింపులు భరించలేం” అని తేల్చి చెప్పారు.
విశాఖ లాంటి పర్యాటక నగరంలో హోటళ్లు మూతపడితే వేలమంది కార్మికులు రోడ్డున పడతారని, పర్యాటకులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని వారు గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని హోటల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.








