తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం మరో మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్(BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడంతో పాటు, బీఆర్‌ఎస్ ఫిర్యాదుదారులకు కూడా అదనపు ఆధారాలు సమర్పించాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది.
ఈ కేసు విచారణలో భాగంగా, సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు స్పీకర్ గతంలో పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. వారిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), సంజయ్ (జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలె యాదయ్య (చేవెళ్ల), తెల్లం వెంకట్రావు (భద్రాచలం) తాము ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్) ఇంకా సమాధానం ఇవ్వలేదు.
ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో మూడు రోజుల్లోగా సమర్పించాలని స్పీకర్ కార్యాలయం బీఆర్‌ఎస్ ఫిర్యాదుదారులకు లేఖలు పంపింది. తదుపరి విచారణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ లేఖల్లో పేర్కొన్నారు.








