ఆధునిక సమాజంలో వైవాహిక బంధాలు ఎంత త్వరగా విడిపోతున్నాయో, విడాకుల (Divorce) తర్వాత భరణం (Alimony) కోసం జరుగుతున్న పోరాటాలు కూడా అంతే తీవ్రంగా మారుతున్నాయి. ఏడు జన్మల బంధం ఏడు రోజుల్లోనే తెగిపోతుందని చెప్పేలా, ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరిన ఒక కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 18 నెలల కాపురానికి రూ.12 కోట్లు భరణంతో పాటు బీఎండబ్ల్యూ కారు (BMW Car) , ఖరీదైన ప్లాట్(Plot)ను కోరిన ఒక భార్యకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో కోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు సమాజానికి, విడాకుల తర్వాత భరణం కోరే ఉద్యోగినులకు ఓ గొప్ప సందేశాన్నిచ్చింది.
న్యాయమూర్తుల ఆశ్చర్యం
ఎంబీఏ చదివి, ఐటీ ఉద్యోగం చేస్తున్న ఒక యువతికి పెళ్లైంది. కానీ కేవలం 18 నెలల్లోనే వారి వివాహ బంధం మనస్పర్థల కారణంగా తెగిపోయింది. దీంతో ఆమె తన భర్త నుంచి ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్, రూ.12 కోట్లు భరణం, విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె చేసిన ఈ భారీ డిమాండ్లను విని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయారు.
సీజేఐ (CJI) జస్టిస్ (Justice) బీఆర్ గవాయి (B.R. Gavai), న్యాయమూర్తులు జస్టిస్ కె.వినోద్ చంద్రన్ (K. Vinod Chandran), జస్టిస్ ఎన్వీ అంజారియా (N.V. Anjaria)తో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. విచారణ సమయంలో, ప్రధాన న్యాయమూర్తి ఆ మహిళ విద్యార్హతలు, వృత్తి అనుభవాన్ని ప్రస్తావిస్తూ కీలక ప్రశ్నలు వేశారు. “మీరు ఐటీ రంగంలో ఉన్నారు. ఎంబీఏ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో మీకు డిమాండ్ ఉంటుంది… మీరు ఎందుకు పని చేయకూడదు?” అంటూ సూటిగా ప్రశ్నించారు.
“కేవలం 18 నెలలపాటే వివాహ బంధాన్ని కొనసాగించారు. మీరు ఇంత భరణం కోరుతున్నారా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో ఆశించడం న్యాయసమ్మతమా అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. దీనికి ఆమె తన భర్త ధనవంతుడని, తనపై మానసిక ఆరోగ్య సమస్యల (షిజోఫ్రెనియా వంటివి) ఆధారంగా వివాహ రద్దు కోసం దరఖాస్తు చేశారని బదులిచ్చారు.
సుప్రీంకోర్టు కీలక ఆదేశం
కోర్టు చివరకు రెండు ఆప్షన్లను ఇచ్చింది: ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేని అపార్ట్‌మెంట్‌ను భరణంగా తీసుకోండి లేదా రూ.4 కోట్లు ఒకేసారి పరిష్కారంగా తీసుకోండి అని సూచించింది. “మీరు చదువుకున్నవారు. మీకు మీరు సంపాదించుకోండి. దయచేసి దీనితో (లభించిన ఆస్తి/డబ్బుతో) గౌరవంగా జీవించండి. ఎవరిపైనా ఆధారపడకండి” అని CJI గవాయి ఆమెకు స్పష్టంగా చెప్పారు. తనపై అభియోగాలు మోపారని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని, అలాంటి పరిస్థితుల్లో ఏ ఉద్యోగం వస్తుందని మహిళ వాపోయింది. దానికి సీజేఐ సమాధానమిస్తూ, “మేం దానిని కూడా రద్దు చేస్తాం. కానీ జీవితాన్ని మీరు కూడా నిలబెట్టుకోవాలి” అని చెప్పారు.








