అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సంభవించిన విషాదం ఘటన అందరి మనసులను కలిచివేసింది. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన చిన్నతిప్పమ్మ (17) అనే విద్యార్థిని, ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది.
ఆమెకు అదే కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ఒక స్నేహితురాలు ఉన్నది. వీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నూతన సంవత్సర వేడుకల సందర్భంలో మంగళవారం రాత్రి కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. అయితే, తన స్నేహితురాలు తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పలేదన్న బాధతో చిన్నతిప్పమ్మ బుధవారం తెల్లవారు జామున హాస్టల్ మెస్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసుల దర్యాప్తు..
ఈ ఘటనను గుర్తించిన తోటి విద్యార్థులు, మృతురాలి కుటుంబసభ్యులు, కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతపురం రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నతిప్పమ్మ మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘం నాయకులు కళాశాల యాజమాన్య నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా హాస్పిటల్ పోస్టుమార్టం రూమ్ ఎదుట ధర్నా చేశారు. కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.








