కూటమి ప్రభుత్వం (Alliance Government) వైసీపీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తోందని, టెర్రరిస్టులు (Terrorists), తాలిబన్ల (Taliban)లా చిత్రీకరిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆరోపించారు. కూటమి తీరు ఇలాగే కొనసాగినా తమకేమీ ఇబ్బంది లేదని, చంద్రబాబు (Chandrababu)కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైల్ (Central Jail)లో తన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy)తో ములాఖత్ (Meeting) అయిన అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. “ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలను కూడా అందించడం లేదు. ఇది మంచి పద్ధతేనా? ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు ఇతర ప్రభుత్వాలకు ఆదర్శంగా మారకూడదు” అని ఆయన సున్నితంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సౌకర్యాలు కావాలని మిథున్ రెడ్డి చెప్పే మనిషి కాదన్నారు పెద్దిరెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డికి ఒక పూట భోజనం బయటి నుంచి అందించేందుకు న్యాయస్థానం అనుమతించినప్పటికీ, ఈ నిబంధనలు అమలు కావడం లేదని, అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామన్నారు. మిథున్ రెడ్డిపై నమోదైన మద్యం కేసు అక్రమమని, రాజకీయ కుట్రలో భాగమని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
“వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. బెల్టు షాపులను నిర్మూలించి, మద్యం ధరలను పెంచి, 2019-2024లో రూ.25,700 కోట్ల ఆదాయం సమకూర్చాము. 2014-2019లో టీడీపీ (TDP) హయాంలో కేవలం రూ.17,000 కోట్లు మాత్రమే వచ్చింది. వైసీపీ(YSRCP) ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు, అన్ని డిస్టిలరీ అనుమతులూ చంద్రబాబు హయాంలోనే ఇవ్వబడ్డాయి” అని ఆయన వివరించారు.
ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కేసు పేరుతో జైలు పాలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం రాజకీయ కుట్ర అని పెద్దిరెడ్డి ఫైరయ్యారు. ఈ చర్య చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అని పెద్దిరెడ్డి ఆరోపించారు.








