హిందూపురం (Hindupuram) వైసీపీ నాయకుడు (YSRCP Leader), మాజీ ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ (Naveen Nischal)ను వైసీపీ అధిష్టానం సస్పెండ్ (Suspended) చేసింది. పార్టీ హైకమాండ్ (High Command) నిర్ణయం తీవ్రంగా స్పందించారు నవీన్ నిశ్చల్. పార్టీలో అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనతో తాను బాధపడట్లేదని, బ్రతికున్నంతవరకూ వైసీపీ (YSRCP)కే అండగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు. “నేను పూర్తిగా చిత్తశుద్ధితో పని చేశాను. కానీ ఆప్యాయతకు బదులుగా పార్టీ నాకు సస్పెన్షన్ గిఫ్ట్ ఇచ్చింది” అంటూ నిశ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు.
బాలకృష్ణను 15 ఏళ్లు ఎదుర్కొన్నా…
“15 ఏళ్లుగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను ఎదుర్కొంటూ హిందూపురం (Hindupuram) ప్రాంతంలో పార్టీ కోసం పనిచేశాను. అప్పట్లో నన్ను పక్కనపెట్టి ఇద్దరు కొత్తవాళ్లను తీసుకొచ్చారు. అయినా బాధపడకుండా నేను పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నాను. 2014లో నాకు పోటీ అవకాశం ఇచ్చినప్పుడు తేడా కేవలం 7 వేల ఓట్లు మాత్రమే. కానీ నా తర్వాత వచ్చిన ఇక్బాల్‌కు 20 వేల, దీపికకు 30 వేల ఓట్ల తేడాతో ఓటమి ఎదురైంది”
“నాకు వ్యతిరేకంగా మొదటి రోజునుంచి కుట్ర జరుగుతోంది. ఈ సస్పెన్షన్ వెనుక కొందరు పెద్దల హస్తం ఉంది. పేర్లు చెప్పలేను కానీ నిజాలు బయటపడతాయి. జగన్ నాకు రెండుసార్లు టికెట్లు ఇవ్వలేదు. అయినా పార్టీ కోసం పనిచేశాను. నాకు వైఎస్ఆర్ అంటే అభిమానం, జగన్ అంటే గౌరవం. 2009లో కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాను. అయినా 2014లో పోటీ చేశాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కార్యకర్తలు నాతో ఉన్నారు. వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనే లేదు. బ్రతికున్నంతవరకూ వైసీపీ కార్యకర్తల కోసం ఉండటం నా ధర్మం” అని నవీన్ నిశ్చల్ అన్నారు.