ఖమ్మం నగరంలోని (Khammam City) వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న నారాయణ కాలేజీ హాస్టల్ (Narayana College Hostel)లో జరిగిన ఘర్షణ కలకలం రేపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సెకండ్ ఇయర్ విద్యార్థి దాడి చేసిన ఘటన స్ట్రీట్ ఫైట్‌ను (Street Fight) తలపించేలా జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం బయటకు వచ్చింది.
హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య వ్యక్తిగత దూషణలు తీవ్రరూపం దాల్చాయి. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారడంతో సెకండ్ ఇయర్ విద్యార్థి ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై దాడి చేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న మరో విద్యార్థి సెల్‌ఫోన్‌లో మొత్తం ఘటనను రికార్డ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దాడిలో గాయపడిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్‌లో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస భద్రత కల్పించకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో వైరల్ కావడంతో కాలేజీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని భావించిన యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టింది. దాడి చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటన ఇద్దరి మధ్య వ్యక్తిగత మనస్పర్ధల కారణంగా జరిగిందని, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు డ్రగ్స్ లేదా మద్యం సేవించిన అంశం పూర్తిగా అవాస్తవమని యాజమాన్యం స్పష్టం చేసింది.







