ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఈ ఐదు స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోనుంది. కాగా, ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీల నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు ప్రభుత్వాధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఏపీ అసెంబ్లీ లాబీలో ఆశావహులు కోలాహలం కనిపించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేషీల దగ్గర ఆశావహులు క్యూ కట్టారు. ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. అసెంబ్లీ లాబీలో బీదా రవిచంద్రయాదవ్, కొమ్మాలపాటి శ్రీధర్, టికెట్ ఆశిస్తున్న బుద్దా వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, ఒక్క ఛాన్స్ అంటున్న అశోక్ బాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి ఉన్నారు.
నేటి నుంచి ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 29న జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవి నుంచి రిటైర్ కానున్నారు.







